రాయికల్: ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులపై పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాయికల్ మండల ఎస్జీటీ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. గురువారం నిర్వహించిన పాఠశాల సముదాయ శిక్షణ కార్యక్రమంలో ఎస్జీటీ ఉపాధ్యాయులు తమ డిమాండ్లపై నినదించారు. జీవో నంబర్ 25ను రద్దు చేయాలని, ఉపాధ్యాయులతో బోధనేతర పనులు చేయించడాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. బోధనేతర పనుల భారం తగ్గిస్తే ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో విద్యార్థుల బోధనపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలని ఎస్జీటీ ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు.

Comments 0