రామగుండం నగరంలో వేసవి కాలంలో నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మేయర్ మహంకాళి స్వామి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి వేసవిలో నీటి ఎద్దడి వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం అవసరమైన నిధుల అంచనాలు సిద్ధం చేసి, సకాలంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఇటీవల కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు ప్రస్తావించిన సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని వెంటనే పరిష్కరించాలని చెప్పారు. వీధి దీపాల నిర్వహణలో ఎనర్జీ సేవింగ్‌పై దృష్టి పెట్టాలని, వాహనాల మరమ్మత్తులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి శానిటేషన్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఎస్‌ఈ గురువీర, ఈఈ పి.వి. రామన్, డీఈలు ఆఫ్తాబ్, శాంతి స్వరూప్, జగదీష్, షాబాజ్, ఏఈలు జమీల్, తేజస్విని, మీర్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.