రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరిఖని వన్‌టౌన్ శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించనున్న శ్రీరామ కళ్యాణోత్సవానికి పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఏర్పాట్లను గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పండుగ రోజు భక్తుల భారీ రద్దీ ఉండనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఆలయం పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించి, భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక దారులు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా ట్రాఫిక్ రద్దీ నివారణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టి భక్తులకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలు గుర్తించి సూచనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఆలయంలో నిబంధనలు పాటిస్తూ, క్యూలైన్లలో శాంతిగా దర్శనం చేసుకోవాలని కోరారు. పండుగను శాంతియుతంగా, సుఖశాంతులతో జరుపుకునేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఏసీపీ విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఇతర పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.