స్థానిక సమరంలో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేసేలా సమన్వయంతో ముందుకు సాగాలని జగిత్యాల జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. రాయికల్ మండల కేంద్రంలో మండలం ఎంపీటిసి పరిధిల వారీగా ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించి, దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా వసంత మాట్లాడుతూ త్వరలోనే స్థానిక ఎన్నికల నగరా మ్రోగే అవకాశం ఉన్నందున గ్రామ గ్రామాన బీఆర్ఎస్ శ్రేణులు అంత స్థానిక సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుందని, దీంతో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసిందని, కనీసం విద్యుత్ దీపాలు పెట్టలేని స్థితిలో పంచాయితీలు ఉండడం విచారకరం అన్నారు. అలాగె అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ లు, 420 హామీలను ఇచ్చి యావత్ తెలంగాణ సమాజాన్ని మోసం చేసిందని, 18 నెలలు పూర్తి స్థాయిలో ఒక్క పథకం కూడా అమలు చెయ్యలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఏద్దేవా చేశారు. గత ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో పల్లెల్లో పండగ వాతావరణం ఉండేదని, పారిశుదద్యం, హరితహారం, హరిత రక్షణ, పల్లె ప్రకృతి వనాలు, ట్రాక్టర్ ల ద్వారా చెత్త తరలింపు, డంపింగ్ యార్డ్ లు ఇలా పల్లె ప్రగతికి కేసీఆర్ గారు బాటలు వేస్తె, ప్రస్తుత ప్రభుత్వం బాతఖాని లతో కాలం వెళ్ళదీస్తుందని విమర్శించారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ గత 18 నెలలుగా అండగా ఉంటూ అలుపెరుగనిపోరాటం చేస్తుందని, దానిలో బీఅరెస్ శ్రేణుల సహకారం మరువలేనిదని అన్నారు. ఇదే స్ఫూర్తితో గడప గడపకు ప్రభుత్వం వైఫల్యాలను తీసుకెళతూ గత పాలన కు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు మధ్య తేడాను ప్రజలకు క్షేత్ర స్థాయి నుండి వివరించాలన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని, గులాబీ జెండా ఎగురావెయ్యడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కదలాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో బీఆరెస్ సభ్యులు నాయకులు బర్కం మల్లేశం, తురగ శ్రీధర్ రెడ్డి, అనిల్, మహేశ్వర్ రావు, మాజీ ఏఎంసీ లు ఉదయశ్రీ, రాణి, రత్నాకర్ రావు, మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్ లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.