రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 48వ డివిజన్‌లోని పద్మావతి కాలనీ సౌరశక్తి వినియోగంలో ఆదర్శంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా 15 కుటుంబాలు తమ ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని విద్యుత్ స్వావలంబన దిశగా ముందడుగు వేశాయి.విద్యుత్ ఆదా, అదనపు లాభాలు సౌర ప్యానెల్‌ల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను గృహ వినియోగంతో పాటు గ్రిడ్‌కు పంపిస్తున్నారు. దీంతో ఒక్కో కుటుంబం నెలకు ₹1500 నుండి ₹3000 వరకు ఆదా చేసుకుంటున్నట్లు నివాసితులు తెలిపారు. విద్యుత్ వినియోగంలో భరోసా, బిల్లుల భారంలో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం ద్వారా సబ్సిడీ లభించడంతో కాలనీలో సౌర వ్యవస్థల ఏర్పాటు సులభమైందని నివాసితులు తెలిపారు. తక్కువ ఖర్చుతో పర్యావరణ హిత శక్తి వినియోగం కొనసాగుతోంది.పర్యావరణ పరిరక్షణే ధ్యేయం కాలనీ డెవలప్‌మెంట్ అసోసియేషన్ సభ్యులు లక్ష్మీనర్సయ్య, ప్రభాకర్ రెడ్డి, కిరణ్, అంబటి సతీష్, రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, “భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన వాతావరణం అందేలా ఈ కార్యాచరణ చేపట్టాం. సౌరశక్తి వినియోగం ద్వారా పర్యావరణ రక్షణతో పాటు ఆర్థిక లాభం కూడా కలుగుతోంది,” అన్నారు.ఈ సందర్బంగా పద్మావతి కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు నడిపల్లి మురళీధర్ రావు, కాస సత్యనారాయణ, నాగండ్ల రవికుమార్, కె. వెంకటరాజం, రఘు రెడ్డి, రాజి రెడ్డి, తిరుపతి గౌడ్, వెంకటేష్ తదితరులు మాట్లాడుతూ, “తదుపరి దశగా పెద్దఎత్తున చెట్లు నాటడం, రైన్ వాటర్ స్టోరేజ్ ట్యాంకులు ఏర్పాటు, చెత్త రహిత గ్రీన్ కాలనీగా మార్చే కార్యక్రమాలు చేపడతాం” అన్నారు.