గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జెడ్పి సిఈవో బి. గౌతమ్ రెడ్డి అధికారులకు సూచించారు. పోలింగ్ ప్రక్రియలో పీవోలు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. సోమవారం రోజున రాయికల్ ప్రభుత్వ పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పి సిఈవో బి. గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను పక్కాగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. సకాలంలో నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు అధికారులు చేరుకోవాలని సూచించారు. చెక్ లిస్ట్కు అనుగుణంగా బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలన్నారు. సీటింగ్ అరెంజ్ మెంట్, సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ వంటి నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటరు ఓటు వేయవచ్చని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క "బ్యాలెట్ పత్రం” కూడా బయటకు వెళ్లకూడదన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికలకు అవసరమైన సామాగ్రిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి తిరిగి వాటిని స్ట్రాంగ్ రూమ్ లకు చేర్చడం వరకు ప్రిసైడింగ్ అధికారుల బాధ్యత అని, వీరికి సహాయ ప్రిసైడింగ్ అధికారులు అవసరమైన చోట సహాయం అందిస్తారని, పోలింగ్ స్టేషన్లో జరిగే అన్ని కార్యక్రమాలు వీరి పర్యవేక్షణలోనే జరుగుతాయని పేర్కొన్నారు.

Comments 0