* వేతనాలు ఇప్పించాలని లేబర్ కమిషన్ జాయింట్ కమిషనర్ సునీత దాస్ కు డబ్ల్యూజేఐ వినతి హైదరాబాద్: ముద్ర పత్రిక సిబ్బందికి యాజమాన్యం వెంటనే వేతనాలు బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) రాష్ట్ర శాఖ కార్మిక శాఖకు విజ్ఞప్తి చేసింది. సోమవారం లేబర్ కమిషనర్ కార్యాలయంలో సంయుక్త కార్మిక కమిషనర్ సునీత గోపాల్ దాస్ ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ప్రతినిధి బృందంలో డబ్ల్యూ జే ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్ రజ్జు భయ్యా, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అనిల్ దేశాయ్ న్యాలకొండ ఉన్నారు. ముద్ర పత్రిక జర్నలిస్టులు, సిబ్బందితో కలిసి వారు సమస్యను వివరించారు. తమకు దాదాపుగా 5 నెలల నుంచి 11 నెలల వరకు జీతం బకాయి ఉన్నట్లు బాధితులు తెలిపారు. ఈ విషయమై త్వరలో ముద్ర యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని సంయుక్త కార్మిక కమిషనర్ సునీత గోపాల్ దాస్ హామీ ఇచ్చారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ముద్ర పత్రిక సెంట్రల్ టెస్ట్ ఇన్చార్జి కే జహంగీర్ పాషా, న్యూస్ ఎడిటర్ రామ్ మనోహర్, చీఫ్ సబ్ ఎడిటర్ ఉమా మహేశ్వరి, సీనియర్ సబ్ ఎడిటర్లు హరనాథ్, కిరణ్, బ్యూరో సభ్యులు శ్రీనివాస్, ముజాహిద్దీన్ బాబా, శరత్, సీనియర్ డిజైనర్లు రవి అనిత, మహేశ్వరి, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
Comments 0