వచ్చే సంవత్సరం జూన్‌లో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ఘాట్‌ల నిర్మాణం, భక్తుల సౌకర్యార్థం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేయనున్నట్లు రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ మేరకు మున్సిపల్ మరియు నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, కార్పొరేటర్లు, కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులతో కలిసి మేయర్ గోదావరిఖని పుష్కర ఘాట్, మల్కాపూర్ శివారు, సింగరేణి ఇన్‌టేక్ వెల్, గోలివాడ, జనగామ తదితర ప్రాంతాల్లో గోదావరి నది తీరాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. భక్తుల రాకపోకలకు అనువైన ప్రదేశాలు, ఘాట్‌ల నిర్మాణానికి అనుకూల ప్రాంతాలు, పార్కింగ్, రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్య సదుపాయాలపై ఇంజనీర్లతో చర్చించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు రామగుండం ప్రాంతానికి పుష్కర స్నానానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశించినట్లు చెప్పారు.దీనిలో భాగంగా ఘాట్‌ల నిర్మాణం, భక్తులకు స్నాన సౌకర్యాలు, చేంజింగ్ రూములు, తాగునీటి సదుపాయం, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ స్థలాలు, రహదారి సౌకర్యాలు, విద్యుత్ వెలుగులు, భద్రతా చర్యలు వంటి అంశాలను డీపీఆర్‌లో చేర్చనున్నట్లు తెలిపారు. అదేవిధంగా భక్తుల భద్రత కోసం అవసరమైన చర్యలు కూడా తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.పుష్కరాలకు ఏడాది ముందుగానే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పుష్కరాల ప్రారంభానికి కనీసం ఆరు నెలల ముందే అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మేయర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ సూపరింటెండింగ్ ఇంజనీర్ గురువీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.వి. రామన్, డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి, డీఈఈలు షాభాజ్, జమీల్, చంద్రమౌళి, టీపీఎస్ నవీన్, నీటి పారుదల శాఖ డీఈ శరత్ బాబు, నాయకులు సింగరేణి శ్రీనివాస్, ఎస్‌కే కన్సల్టెన్సీ ప్రతినిధి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా అంతకుముందు పుష్కర ఘాట్‌ల నిర్మాణానికి సంబంధించి ఎస్‌కే కన్సల్టెన్సీ రూపొందించిన మ్యాప్‌ను నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.