చెత్తను రోడ్లపై, కాలువల్లో, ఖాళీ స్థలాల్లో వేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి 49వ డివిజన్ మార్కండేయ కాలనీలో నాలా పూడిక తీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇంటి వద్దకు వచ్చే రాగ్ పిక్కర్‌కు నెలకు కేవలం రూ.40 చెల్లిస్తే చెత్తను సేకరించే సౌకర్యం ఉందన్నారు. నగర పాలక సంస్థ కోట్లాది రూపాయల వ్యయంతో వాహనాలు కొనుగోలు చేసి పారిశుద్ధ్య సిబ్బందిని నియమించినప్పటికీ కొంతమంది ప్రజలు చెత్తను రోడ్లపై, కాలువల్లో పడేయడం బాధాకరమన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చెత్త బయట వేస్తున్న వారిపై రూ.500 జరిమానా విధించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ఏళ్ల తరబడి కాలువల్లో పూడిక తీయకపోవడంతో మురుగు నీరు నిలిచి పందులు, దోమల బెడద పెరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు పారిశుద్ధ్య వాహనాలను అద్దెకు తీసుకొని అదనపు సిబ్బందితో పూర్తిస్థాయిలో కాలువల పూడిక తీత పనులు చేపడతామని చెప్పారు. ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆలోచనలకు అనుగుణంగా రామగుండాన్ని క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మేయర్ స్వయంగా పారిశుద్ధ్య సిబ్బందికి సూచనలు ఇస్తూ నాలాలో పూడిక తీయించారు. 47వ డివిజన్‌లో పర్యటన: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మేయర్ మహంకాళి స్వామి స్థానిక కార్పొరేటర్ దాసరి సాంబమూర్తితో కలిసి 47వ డివిజన్ బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. సానిటేషన్ పరిస్థితులను పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో చెత్త వేయకుండా యజమానులకు నోటీసులు జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. వీధి దీపాల మరమ్మత్తు పనులను పరిశీలించి డార్క్ స్పాట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలనీ వాసులతో మాట్లాడి మునిసిపల్ సేవలకు సంబంధించిన సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మేయర్ స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేసి ప్రజలు కూడా స్వచ్చందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 58వ డివిజన్‌లో వైద్య శిబిరం ప్రారంభం: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 58వ డివిజన్ ఆడ్డగుంటపల్లి పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని మేయర్ మహంకాళి స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్య సేవలందించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఆసుపత్రి ఆవరణను పరిశీలించి రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి ఆసుపత్రి పరిసరాలు ఆరోగ్యకరంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, స్థానిక కార్పొరేటర్లు సాగి సంతోష్ రావు, దాసరి సాంబమూర్తి, మేకల సమ్మయ్య, మేకల శారద, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఎస్.ఇ. గురువీర, ఈ.ఇ. పి.వి. రామన్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ రాజమౌళి, వైద్యాధికారి స్నేహలత, కమ్యూనిటీ ఆర్గనైజర్ అనిత తదితరులు పాల్గొన్నారు.

Comments 0