రామగుండం నగరంలోని 49వ డివిజన్ టీచర్స్ కాలనీ గత మూడు దశాబ్దాలుగా మురుగు సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. సరైన అండర్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో కాలనీ అంతా మురుగు కుంటగా మారి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో నిల్వ మురుగు నీటి కారణంగా దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. అలాగే విషపురుగులు, పాములు సంచరిస్తుండటంతో భయభ్రాంతులతో రోజులు గడుపుతున్నామని వాపోతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి మురుగు నీరు ఇళ్లలోకి చేరుతోందని తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు నాణ్యమైన బీటీ రోడ్డు వెంటనే వేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా పాలనలోనైనా తమ కష్టాలు తీరుతాయనే ఆశతో అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు. ఇటీవల రామగుండం మేయర్ మహంకాళి స్వామి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా కాలనీని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. తాత్కాలికంగా మురుగు నీటి మళ్లింపు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. త్వరలోనే అండర్ డ్రైనేజీ, కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 49వ డివిజన్ కార్పొరేటర్ సాగి సంతోష్ రావు మాట్లాడుతూ, కాలనీ మురుగు సమస్య పరిష్కారమే తన ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ సహకారంతో నిధులు తీసుకువచ్చి కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.వి. రామన్, వార్డు అధికారులు, సానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కాలనీవాసులు ఎదురుచూస్తున్నారు.