మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చే ప్రజలు శాలువాలు, పూల బొకేలు తీసుకురావద్దని, వాటి బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే నోట్‌బుక్స్, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు తీసుకురావాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి సూచించారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్ ఎదుట దీనికి సంబంధించిన ప్రత్యేక బోర్డ్‌ను ఏర్పాటు చేయించారు. సమాజానికి ఉపయోగపడే విధంగా చిన్న మార్పు ద్వారా పెద్ద సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ చేసే చిన్న సహాయం కూడా విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని మేయర్ పేర్కొన్నారు. శాలువాలు, బొకేలు తాత్కాలికమైనవి కాగా, పుస్తకాలు మాత్రం విద్యార్థుల జ్ఞానాన్ని పెంచి వారికి ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని, తీసుకువచ్చే పుస్తకాలను అవసరమైన విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.