రామగుండం నగరంలో నీటి సరఫరా సమస్యలపై మేయర్ మహంకాళి స్వామి కఠినంగా స్పందించారు. శనివారం శారదా నగర్ పీజీ కళాశాల ఎదుట డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్లలో ఏర్పడిన లీకేజీల మరమ్మత్తు పనులను ఆయన స్వయంగా ఫీల్డ్‌లో కూర్చొని పర్యవేక్షించారు. లీకేజీల కారణంగా ప్రశాంత్ నగర్ నుంచి పవర్ హౌస్ కాలనీ వరకు దాదాపు నాలుగు డివిజన్లలో నీటి సరఫరా అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో, సాయంత్రం లోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. రేపటి నుంచి నీటి సరఫరా యథాతథంగా కొనసాగాలని స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడైనా లీకేజీలు గుర్తించిన వెంటనే 9392483959 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని, ఫోటో తీసి లొకేషన్‌తో వాట్సాప్ చేయాలని ప్రజలను కోరారు. మున్సిపల్ సేవలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఇదే నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, ప్రతి కనెక్షన్‌కు వాల్వ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వేసవిలో నీటి కొరత లేకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని మేయర్ తెలిపారు.