రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి జీఎం కాలనీలో ఓ వృద్ధురాలిపై జరుగుతున్న వేధింపులపై పోలీసులు తక్షణమే స్పందించి స్పాట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జీఎం కాలనీకి చెందిన ఓ వృద్ధురాలు తన కుమారుడు, కోడలు తనను వేధిస్తూ సరిగా చూసుకోవడం లేదని గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డికి సమాచారం అందించింది. సమాచారం అందిన వెంటనే ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ మనోహర్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని కలసి పూర్తి వివరాలు సేకరించారు. అలాగే స్థానికుల నుంచి కూడా సమాచారం సేకరించి బాధితురాలి ఫిర్యాదును స్వీకరించి సంఘటన జరిగిన ప్రదేశంలోనే స్పాట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు నమోదు చేశారు. వృద్ధులపై జరుగుతున్న వేధింపులు మరియు నిర్లక్ష్యంపై పోలీస్ శాఖ తీవ్రంగా స్పందిస్తోందని, ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సీఐ ఇంద్రసేన రెడ్డి తెలిపారు. వృద్ధుల సంరక్షణ ప్రతి కుటుంబ సభ్యుడి బాధ్యత అని, వృద్ధులను వేధించడం లేదా వారికి తగిన సంరక్షణ, ఆహారం అందించకుండా నిర్లక్ష్యం చేయడం చట్టపరంగా నేరమని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించి సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రజలు తమ పరిసరాల్లో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులపై ఎలాంటి వేధింపులు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు రావడం కష్టమైన పరిస్థితుల్లో ఉన్నవారు 8712656516, 8712656517, 8712656518, 8712656519 నెంబర్లకు లేదా డయల్ 100కు సమాచారం అందిస్తే బాధితుల వద్దకే వచ్చి ఫిర్యాదు స్వీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపడతామని తెలిపారు. తమ కాలనీలు, నగరాల్లో అనుమానాస్పద సంఘటనలు గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజల సహకారంతో నేరాలను అరికట్టడం సులభమవుతుందని సీఐ ఇంద్రసేన రెడ్డి పేర్కొన్నారు.

Comments 0