మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వశక్తి మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. స్వశక్తి మహిళలతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసే దిశగా ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమృత్ మిత్ర పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సహకారం అందించేందుకు మున్సిపల్ కాంట్రాక్ట్ పనులు కూడా అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. మెప్మా ద్వారా అందించే రుణాలతో మహిళా పొదుపు సంఘాలు చిన్న వ్యాపారాలు ప్రారంభించి స్వయం ఉపాధి పొందేలా సహకరిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ అమలుతో ఎన్నికైన మహిళా వార్డు సభ్యులు తమ డివిజన్ల అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి పనిచేయాలని సూచించారు. అన్ని సమావేశాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు, ఆర్‌పీలకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు మేయర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా ఉద్యోగులు, మహిళా కార్పొరేటర్లు, ఆర్‌పీలను మేమెంటోలు అందజేసి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్పొరేటర్లు భాగ్యలక్ష్మి, రమాదేవి, మౌనిక, నగర పాలక సంస్థ ఎస్.ఇ. గురువీర, ఈ.ఇ. పి.వి. రామన్, ఏ.ఈ. తేజస్విని, టెక్నికల్ ఆఫీసర్ సౌమ్య, మెప్మా టి.ఎం.సి మౌనిక, కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఊర్మిళ, శ్వేత, ప్రియదర్శిని, ఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.