రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మేయర్ మహంకాళి స్వామి వార్డు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డివిజన్ ప్రజలు మరియు నగర పాలక సంస్థ మధ్య వారధిగా బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. శానిటేషన్ నిర్వహణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.స్వచ్ఛ రామగుండంగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ నెలతో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆస్తి పన్ను వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి లోపు వంద శాతం పన్ను వసూళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. నీటి బిల్లులు, ట్రేడ్ లైసెన్స్ రుసుములు కూడా లక్ష్యాలకు అనుగుణంగా వసూలు చేయాలని సూచించారు. రెవెన్యూ అధికారులు రోజువారీగా వసూళ్ల పురోగతిని సమీక్షించాలని చెప్పారు. నగర పాలక సంస్థ ఆదాయాన్ని పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించాలని మేయర్ సూచించారు.ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.వి. రామన్, అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Comments 0