తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో చురుకుగా పాల్గొని యువత, విద్యార్థులు, ప్రజల్లో చైతన్యం కల్పించిన ఉద్యమకారుడు,రెండు సంవత్సరాల క్రితం కాలు కోల్పోయిన దివ్యాంగుడు మల్లారెడ్డి నేడు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. 70 సంవత్సరాల వయస్సు దాటినా, దివ్యాంగుడిగా జీవనం సాగిస్తున్నప్పటికీ ఆయనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం లేదా పెన్షన్ అందకపోవడం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.తెలంగాణ ఉద్యమ సమయంలో రాయికల్ ప్రాంతంలో ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లడంలో మల్లారెడ్డి కీలక పాత్ర పోషించినట్లు స్థానికులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర సాధన కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను ఉద్యమం వైపు ఆకర్షించిన ఆయన, ప్రస్తుతం వృద్ధాప్యం మరియు దివ్యాంగత్వంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి గౌరవించాలని, ముఖ్యంగా మల్లారెడ్డికి తక్షణమే దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేసి ఆర్థిక భరోసా కల్పించాలని కోరుతున్నారు. ఉద్యమ సమయంలో సమాజం కోసం సేవలందించిన వ్యక్తి నేడు సహాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి మల్లారెడ్డి పరిస్థితిని పరిశీలించి తగిన సహాయం అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టే క్రమంలో ఉద్యమకారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments 0