రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిశోర్ ఝా క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు, పోలీసు సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాలు, కీలక కూడళ్లు, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన కమిషనర్, పర్యటన పూర్తయ్యే వరకు అధికారులు పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించాలని సూచించారు. పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, భద్రతా చర్యల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.