మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడిన ముఖ్యంశాలు మన తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ సరఫరాలపై ప్రజల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల్లో ఇంధనం లేదని చెప్పడం, కొంతసేపు పంపులను మూసివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితులు ప్రజల్లో భయాందోళనలను కలిగించాయి. అయితే, వాస్తవానికి ఈ పరిస్థితులు మన రాష్ట్రానికి లేదా మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావు. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు వంటి కారణాల వల్ల ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో మనం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాము. అందువల్ల ప్రపంచ పరిస్థితుల ప్రభావం మన దేశంపైన కూడా పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు తీసుకుంటోంది. దేశంలో అంతర్గతంగా జరుగుతున్న ప్రాసెసింగ్ (refining) సామర్థ్యాన్ని పెంచుతూ, అవసరమైన ఇంధనాన్ని దేశంలోనే అందించే దిశగా కృషి జరుగుతోంది. అంతేకాకుండా విదేశాల నుండి రావాల్సిన పెట్రోలియం ఉత్పత్తులను కూడా విజయవంతంగా దిగుమతి చేసుకునే విధంగా ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు ఎదురవుతున్న ఈ సమయంలో, భారత ప్రభుత్వం ప్రతి రోజు అనేక దేశాల నాయకులతో చర్చలు జరుపుతోంది. దేశానికి అవసరమైన ఇంధనం కొరత లేకుండా ఉండేందుకు, ఇతర దేశాలు నిర్ణయించిన ధరలను చెల్లించి అయినా సరే, పెట్రోల్ మరియు డీజిల్ వంటి ఉత్పత్తులను దేశానికి తీసుకురావడంలో కట్టుబడి ఉంది. ఎందుకంటే దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇక మన దేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రజల అవసరాలు కూడా పెరుగుతున్నాయి. గతంలో కట్టెలు, కిరోసిన్ వంటి ఇంధనాలను ఉపయోగించిన ప్రజలు, ఇప్పుడు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎల్పీజీ గ్యాస్‌ను ఉపయోగిస్తున్నారు. “ఉజ్వల పథకం” ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, చిన్న రైతులు కూడా గ్యాస్ సిలిండర్లను పొందగలిగారు. సబ్సిడీ ద్వారా వారికి మరింత సౌలభ్యం కల్పించబడింది. ఈ పరిస్థితుల్లో మనం ఇంధన వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ, దేశవ్యాప్తంగా రైల్వేలను విద్యుదీకరణ చేస్తూ, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియా విషయానికి వస్తే, ఇది సమాచారం పంచుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో తప్పుడు ప్రచారం ప్రజల్లో భయాందోళనలను పెంచుతోంది. పెట్రోల్ కొరత ఉందనే వదంతులు అనవసరమైన రద్దీకి దారి తీసాయి. అయితే, ఆయిల్ కంపెనీల అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినట్లుగా, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ కొరత ఏమీ లేదు. దేశవ్యాప్తంగా సరఫరాలు సక్రమంగా కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందువల్ల మనం అందరం శాంతంగా ఉండి, వదంతులను నమ్మకుండా, బాధ్యతతో వ్యవహరించాలి. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఐక్యంగా ఎదుర్కొంటేనే మనం విజయాన్ని సాధించగలం.