మంథని, అక్టోబర్ 4: కూచిరాజపల్లి శివారులోని పెద్దమ్మ గుడి తాళ్ల చెట్టు ప్రాంతంలో వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసిన బోర్ మోటార్ చోరీకి గురైంది. సర్వే నంబర్ 34లో అంబటి సతీష్ కుమార్‌ (S/o మధునయ్య), అంబటి శంకర్‌ (S/o బలరాం)అంబటి సతీష్ కుమార్ (s/o కొమురయ్య) కు చెందిన సుమారు 4.5 ఎకరాల భూమిని శ్రీరామ్‌నగర్‌కు చెందిన అలకుంట రాజు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం (అక్టోబర్ 3) సాయంత్రం వరకు పొలంలో ఉన్న 5 హెచ్‌పీ టెక్స్మో కంపెనీ బోర్ మోటార్ ఆదివారం ఉదయం కనిపించలేదు. కౌలుదారు అలకుంట రాజు తన సహాయకుడు బాలుతో కలిసి పొలానికి వెళ్లి పరిశీలించగా మోటార్ చోరీకి గురైనట్లు గుర్తించారు. మోటార్ విలువ సుమారు రూ.35 వేలుగా తెలిపారు. ఘటనపై మంథని పోలీసులకు ఫిర్యాదు చేసిన అలకుంట రాజు, చోరీకి గురైన మోటార్‌ను గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.