గంగపుత్రుల సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే గంగ తెప్పోత్సవానికి తెలంగాణ రాష్ట్ర పండుగ హోదా కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా జీఓ విడుదల చేసే అవకాశం ఉందని గంగపుత్ర సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ గంగ తెప్పోత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత తొమ్మిదేళ్లుగా గంగ తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. కమిటీ అధ్యక్షుడు మహేందర్‌బాబు బెస్త, ప్రధాన కార్యదర్శి పూస నర్సింహ బెస్త ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అలాగే పెద్దపల్లి జిల్లా మంథని బెస్తపల్లిలో పరిసర గ్రామాల ప్రజల భాగస్వామ్యంతో అఖిల భారత గంగ తెప్పోత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, మత్స్య సొసైటీలు ఉన్న ప్రాంతాల్లో గంగపుత్రులు ఈ ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. రాష్ట్ర పండుగగా గుర్తింపు లభిస్తే తెలంగాణలోని సుమారు 5 లక్షల మంది గంగపుత్రులకు ఇది సాంస్కృతిక గౌరవంగా నిలుస్తుందని వివిధ గంగపుత్ర సంఘాలు పేర్కొన్నాయి. పలు రాష్ట్ర, జాతీయ స్థాయి సంఘాలు ఇప్పటికే గంగ తెప్పోత్సవానికి మద్దతు ప్రకటించి, ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఐక్యంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించాయి. జలసిరికి హారతిగా 2026 గంగ తెప్పోత్సవం 2026 గంగ తెప్పోత్సవాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్‌లోని మెట్రో స్టేషన్‌ (ఏడు గుళ్ల) ప్రాంతం నుంచి ప్రారంభమయ్యే మహా శోభాయాత్ర రైల్వే గేటు, బడా గణేష్‌ జంక్షన్‌, ఐమ్యాక్స్‌ మీదుగా నెక్లెస్‌ రోటరీ వైపు సాగనుంది. హుస్సేన్‌సాగర్‌ తీరంలోని గంగమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గంగతెప్పను జలరాశిలోకి ప్రవేశపెట్టనున్నారు. శోభాయాత్రలో బోనాలు, జోగినీ బోనాలు, చేపల వలల ప్రదర్శనలు, వగ్గుడోలు, పోతురాజుల విన్యాసాలు, జానపద కళాబృందాల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఉత్సవాల ముగింపుగా 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలోని హెచ్‌ఎండీఏ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాజకీయ ప్రముఖులు, సినీ కళాకారులు, మత్స్యశాఖ ప్రతినిధులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.