గోదావరిఖని: ఆర్‌జీ-1 పరిధిలోని సివిల్ డిపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సిబ్బంది కేటాయింపులు, కీలక విధుల్లో అనుభవం ఉన్నవారికి బదులుగా జూనియర్లకు బాధ్యతలు అప్పగించడం, కార్మికుల ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం వంటి అంశాలపై కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇంటెక్ వెల్‌లో ఇష్టారాజ్యమా..? గోదావరిఖని సింగరేణి కార్మిక కుటుంబాలతో పాటు 8వ కాలనీ, సెంటినరీ కాలనీ ప్రాంతాలకు నీటి సరఫరాలో ఇంటెక్ వెల్ కీలకంగా ఉంది. ఇక్కడ పంపుల నిర్వహణకు సీనియారిటీ కలిగిన ఇద్దరు పంప్ ఆపరేటర్లను కేటాయించడం జరుగుతుందని కార్మికులు చెబుతున్నారు. అయితే సీనియర్ పంప్ ఆపరేటర్ సెలవులో ఉన్న సమయంలో తదుపరి సీనియర్‌ను కేటాయించాల్సి ఉండగా, జూనియర్ సిబ్బందిని విధుల్లో నియమిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వినాయక చవితి నిమజ్జనం రోజున ఇద్దరు పంప్ ఆపరేటర్లకు బదులుగా ఒక వెల్డర్‌ను విధుల్లో కేటాయించడంపై కూడా కార్మికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. స్టోర్ బాధ్యతలపైనా ప్రశ్నలు సివిల్ డిపార్ట్‌మెంట్‌లో స్టోర్ బాధ్యతలను క్లర్క్ నిర్వహించాల్సి ఉండగా, జనరల్ అసిస్టెంట్‌కు అప్పగించడంపై కార్మికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. విధుల కేటాయింపులో స్పష్టత లేకపోవడం, ఎవరి బాధ్యత ఏమిటన్న దానిపై అయోమయం నెలకొనడం వంటి అంశాలు డిపార్ట్‌మెంట్‌లో చర్చకు దారితీస్తున్నాయి. ఫిర్యాదులు చేసినా ఫలితం లేదంటున్న కార్మికులు సివిల్ కార్యాలయంలో ఓ క్లర్క్‌పై పలువురు కార్మికులు ఆరోపణలు చేస్తున్నారని, తమ సమస్యలను పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందన కనిపించడం లేదని కార్మికులు వాపోతున్నట్లు సమాచారం. తాజాగా సోమవారం ఉదయం ఓ కార్మికుడు తన సమస్యను సంబంధిత అధికారికి వివరిస్తుండగా, అక్కడ మాట్లాడవద్దంటూ మరో కార్మికుడు బండతో దాడికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ బాధిత కార్మికుడు సంబంధిత హెచ్‌ఓడీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జీఎం జోక్యంపై ఆశలు సివిల్ డిపార్ట్‌మెంట్‌లో నెలకొన్న సమస్యలపై స్థానిక జీఎం ప్రత్యేక దృష్టి సారించి, సిబ్బంది కేటాయింపులు, విధుల నిర్వహణ, కార్మికుల ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులను పరిశీలించి, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి సివిల్ డిపార్ట్‌మెంట్‌లో క్రమశిక్షణ, పారదర్శకతతో కూడిన పని వాతావరణాన్ని నెలకొల్పాలని కార్మికులు కోరుతున్నట్లు సమాచారం.