విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తూ అవసరమైన సహకారం అందిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 క్లస్టర్–సి పోటీల్లో కాళేశ్వరం జోన్–I తరఫున పాల్గొన్న రామగుండం పోలీస్ కమిషనరేట్ క్రీడాకారులు సత్తా చాటారు. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో 1 రజతం, 6 కాంస్య పతకాలు సాధించి మొత్తం 7 పతకాలను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంబర్ కిషోర్ ఝా క్రీడాకారులను శాలువాలతో సత్కరించి అభినందించారు. కమిషనరేట్ తరఫున మొత్తం 17 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. టేబుల్ టెన్నిస్ విభాగంలో 50+ మిక్స్‌డ్ డబుల్స్‌లో ఏసీపీ ప్రతాప్–డబ్ల్యూపీసీ ఎం.వనిత జోడీ, 40+ సింగిల్స్‌లో పీసీ ఎం.ఉదయ్ కిరణ్, పీసీ-3499, ఓపెన్ ఉమెన్స్ డబుల్స్‌లో డబ్ల్యూపీసీ కె.విజయ–కె.దీప జోడీ, 40+ ఉమెన్స్ డబుల్స్‌లో డబ్ల్యూపీసీ ఎం.వనిత–కె.విజయ, పీసీ-1469 జోడీ, 40+ మిక్స్‌డ్ డబుల్స్‌లో పీసీ డి.రాజేందర్, పీసీ-2952–డబ్ల్యూపీసీ ఎం.వనిత జోడీలు కాంస్య పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్ ఓపెన్ సింగిల్స్‌లో కె.సురేష్ రజత పతకం సాధించగా, ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కె.సురేష్–కె.విజయ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసు విధుల్లో నిరంతరం ఒత్తిడితో పనిచేసే అధికారులు, సిబ్బందికి క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ చూపుతున్న పోలీసు సిబ్బందిని శాఖ తరఫున ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్‌ఐలు మల్లేశం, శేఖర్, రమేష్, సీసీ సందీప్, ఆర్‌ఎస్‌ఐలు, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు నవీన్, సభ్యులు వినోద్ తదితరులు పాల్గొన్నారు.