రామగుండం, సెప్టెంబర్ 27: స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ దేశానికి, తెలంగాణకు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి తన ఇల్లు, ఆస్తులను సైతం అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. 1915 సెప్టెంబర్ 27న వాంకిడి గ్రామంలో జన్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ రాజకీయ, ప్రజా జీవితంలో కీలక బాధ్యతలు నిర్వహించారని సీపీ తెలిపారు. ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా సేవలందించడంతో పాటు 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇందిరాపార్క్, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సత్యాగ్రహాలు నిర్వహించి తన నిబద్ధతను చాటుకున్నారని అన్నారు. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని సీపీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఆర్ఐ మల్లేశం, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Comments 0