ామగుండం: నగరంలో వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి బుధవారం నగరంలో విస్తృతంగా పర్యటించారు. పలు డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి, పనుల నాణ్యతపై పలు సూచనలు చేశారు. కళ్యాణ్ నగర్ నుంచి అడ్డగుంటపల్లి వెళ్లే రహదారిని ట్రాన్స్‌కో అధికారులతో కలిసి పరిశీలించిన మేయర్, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నేతృత్వంలో వాణిజ్య ప్రాంతాల్లో రహదారి విస్తరణ చేపట్టినప్పటికీ, పాత విద్యుత్ స్తంభాలు తొలగించకపోవడంతో రహదారి ఇరుకుగా కనిపిస్తోందని పేర్కొన్నారు. కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి సిద్ధంగా ఉన్నందున, పాత స్తంభాలపై ఉన్న విద్యుత్ కనెక్షన్లను కొత్త స్తంభాలకు మార్చి, ఖాళీగా ఉన్న పాత స్తంభాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే సోమవారం నాటికి ఈ పనులను పూర్తి చేస్తామని ట్రాన్స్‌కో ఏడీఈ గుండు శ్రీనివాస్, ఏఈ జమీల్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గట్ల రమేష్, ధూళికట్ట సతీష్, చిదురాల నాగరాజు, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. అనంతరం 50వ డివిజన్ గాంధీనగర్‌లో స్థానిక కార్పొరేటర్ ధూళికట్ట సతీష్ ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ రూ.12.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) నిర్మాణ పనులను మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు 80 శాతం సింగరేణి కార్మికులు నివసించే ఈ ప్రాంతంలో కనీస మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. యూజీడీ నిర్మాణం ఈ ప్రాంతానికి అత్యంత అవసరమని పేర్కొంటూ, పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సింగరేణి డిప్యూటీ ఎస్ఈ రాజు, సూపర్వైజర్ అశోక్‌కుమార్‌లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వడ్లూరి రవి, దాసరి సాంబమూర్తి, నాయకులు కందుల సతీష్ తదితరులు పాల్గొన్నారు. తదుపరి రామగుండం మండల తహసీల్దార్ రవీందర్‌తో కలిసి 46వ డివిజన్ సంజయ్‌నగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదించిన ఖాళీ స్థలాన్ని మేయర్ పరిశీలించారు. ఇప్పటికే ఈ స్థలంలో ట్రాన్స్జెండర్లకు ఇంటి స్థలాలు కేటాయించిన నేపథ్యంలో, మిగిలిన స్థలాన్ని సర్వే చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనువుగా ప్లాటింగ్ చేసి ప్రొసీడింగ్స్ జారీ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం 47వ డివిజన్ సాధనానగర్లో కార్పొరేటర్ దాసరి సాంబమూర్తితో కలిసి నిర్మాణంలో ఉన్న యూజీడీ, సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యతపై నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతిస్వరూప్, ఏఈ మీర్లకు పలు సూచనలు చేశారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో అమలు చేస్తున్న అల్పాహార పథకం అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, రామగుండంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఏర్పాట్లను మేయర్ ఎంఈఓ మల్లేశంతో కలిసి సమీక్షించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దారంగుల కుమార్, నాయకులు అయోధ్య సింగ్, సలీం, పాఠశాల, కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.




Comments 0