మాదకద్రవ్యాల నిర్మూలనపై సమాజంలో అవగాహన కల్పించడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. జూన్ 22 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా గర్రెపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, మంచి విలువలు అలవర్చుకుంటే మత్తు పదార్థాల బారిన పడకుండా మంచి భవిష్యత్తును నిర్మించుకోగలరని తెలిపారు. చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా ఎదగాలని సూచించారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై తమ గ్రామాలు, కాలనీలు, పరిసర ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులు ‘యాంటీ డ్రగ్ సోల్జర్స్’గా ముందుండాలని కోరారు. మత్తు పదార్థాలు ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని కష్టపడి పనిచేస్తే ప్రతి విద్యార్థి జీవితంలో విజయం సాధించగలడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సీఐ రంజిత్ కుమార్, నార్కోటిక్ టీం ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్, ఎస్సై చంద్రకుమార్, జూలపల్లి ఎస్సై మల్లేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.