మంచిర్యాల, సెప్టెంబర్ 28: సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్‌తో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ.. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థలంలోని రహదారి పరిస్థితులు, డివైడర్‌లోని ఖాళీలు తదితర అంశాలను పరిశీలించారు. ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఆటో రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తూ ఎదురుగా వచ్చిన టిప్పర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని సీపీ తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం అత్యంత విషాదకరమని, మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు. పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. రహదారి మధ్యలోని డివైడర్‌లో ఉన్న ఖాళీ ద్వారా వాహనాలు అక్రమంగా మలుపు తిరిగే అవకాశం ఉన్నట్లు గుర్తించామని సీపీ వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని ప్రమాదకర ప్రాంతంగా గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డివైడర్‌లోని ఖాళీలను మూసివేయడంతో పాటు అవసరమైన నిర్మాణాత్మక మార్పులు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టేందుకు సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపించి, సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి పోలీసు శాఖ తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని సీపీ తెలిపారు. తీవ్రంగా గాయపడిన కొంతమందిని ఇప్పటికే కరీంనగర్‌కు తరలించగా, మరికొందరు మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా సహకరిస్తున్నామని తెలిపారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా స్థానిక కలెక్టర్‌తో సమన్వయం చేస్తున్నామని సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ఇంజినీరింగ్, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.