రాయికల్: విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ సిబ్బందిపై దాడికి యత్నించిన ఘటనపై రాయికల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అల్లీపూర్ సబ్స్టేషన్లో ఏ ల్ యం గా విధులు నిర్వహిస్తున్న ఎం. గంగారాజుపై దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అల్లీపూర్కు చెందిన రవి పై విద్యుత్ అధికారులు ఫిర్యాదు అందజేశారు. ఏ ఈ ఓ పి రాయికల్ నవీన్ ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బంది రాయికల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి యస్. ఐ సుధీర్ కి సంబంధిత వ్యక్తిపై ఫిర్యాదు సమర్పించారు. ఈ సందర్భంగా ఏ ఈ నవీన్ మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ, ఎండా వానలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు వాటిని సరిచేయడం, వినియోగదారుల సమస్యలను పరిష్కరించడం వంటి బాధ్యతలను సిబ్బంది నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ సిబ్బందికి ఆటంకం కలిగించడం, దురుసుగా ప్రవర్తించడం లేదా దాడికి యత్నించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నవీన్ హెచ్చరించారు. ప్రజలు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని, సమస్యల పరిష్కారానికి అధికారులను సంప్రదించాలని, విధి నిర్వహణలో ఉన్న సిబ్బందితో సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. విద్యుత్ సిబ్బంది భద్రతతో పాటు నిరంతర విద్యుత్ సేవలు కొనసాగేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు.

Comments 0