జాతీయభాష హిందీ ద్వారా విద్యార్థులలో జాతీయభావాలు పెంపొందుతాయని, దేశభక్తి కలిగిన ఉత్తమ పౌరులుగా వారు ఎదుగుతారని తాట్లావాయి కాంప్లెక్స్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బోగ రమేష్ అన్నారు. జడ్పీహెచ్ఎస్ తాట్లావాయి పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన హిందీ ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హిందీ భాష దేశవ్యాప్త ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని, భిన్న భాషలు, సంస్కృతులు కలిగిన భారతదేశాన్ని ఒక్కటిగా కట్టిపడేసే శక్తి హిందీకి ఉందని పేర్కొన్నారు. ఆరవ, ఏడవ తరగతి విద్యార్థులకు హిందీ వర్ణమాల, గుణితాలు పటిష్టంగా నేర్పి, వారు ఎనిమిదో, తొమ్మిదో, పదవ తరగతులకు వచ్చేసరికి హిందీని స్పష్టంగా చదివే స్థాయికి తీసుకురావాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఇది విద్యార్థుల భాషా నైపుణ్యాలను పెంపొందించడమే కాకుండా జాతీయ చైతన్యాన్ని బలపరుస్తుందని తెలిపారు. జాతీయభాష అభివృద్ధి బాధ్యత ప్రతి హిందీ ఉపాధ్యాయుడిపైనే ఉందని, అందరూ సమిష్టిగా కృషి చేసి హిందీ భాష ఔన్నత్యాన్ని విద్యార్థులకు చేరువ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు హిందీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, రీసోర్స్ పర్సన్స్ వసంతరావు, సయీద్ పాషా, సి.ఆర్.పి నూతికట్ల సత్యనారాయణ, రాపర్తి నర్సయ్య, మ్యాకల శంకరయ్య, మోర నరహరి, జంగిలి రాజేశం, నారాయణ, కూరగాయల సురేష్, గంగాధర్, రమేష్, మల్లేషం, యశోద, సదా లక్ష్మీ, ధనలక్ష్మి, స్వప్న, పద్మజా, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Comments 0