|
modi add 1

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” ప్రారంభం: ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక **“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”**ను రామగుండం నగరంలో శుక్రవారం ప్రారంభించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ మేయర్ మహంకాళి స్వామితో కలిసి పచ్చ జెండా ఊపి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా కార్పొరేటర్లు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి పనులు వేగంగా పూర్తి అవుతాయని, సంక్షేమ పథకాలు అర్హులకు చేరుతాయని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 6 నుంచి 15 వరకు ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్ను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సూచించారు. నగరంలో పరిశుభ్రత మెరుగుపరచడంలో వార్డు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎన్‌సీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నగరాన్ని పరిశుభ్రతలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చడం తన బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళా సాధికారతపై దృష్టి సారించి సబ్సిడీ రుణాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలుకు రోజువారీ షెడ్యూల్ రూపొందించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రోడ్లు, కూడళ్ల శుభ్రత, మురుగు కాలువల్లో పూడిక తీత, స్వచ్ఛ వాహనాల మరమ్మత్తులు, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల తొలగింపు, కార్యాలయాల పరిశుభ్రత వంటి పనులు చేపడతామని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు 2కే, 5కే రన్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.ప్రతి కార్పొరేటర్ తమ డివిజన్‌లో జరిగే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు. వార్డు అధికారులు కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమ పురోగతిపై ప్రతిరోజూ నివేదిక సమర్పించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఎస్‌ఈ గురువీర, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, మెప్మా టీఎం మౌనిక తదితరులు పాల్గొన్నారు.

By Ambati Sathish kumar | March 06, 2026 | 0 Comments