గోదావరిఖని నగరంలోని మార్కండేయ మండల్ శారదా నగర్ శిశు మందిర్‌లో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య వక్త కరీంనగర్ విభాగ ప్రచారక్ భానుచందర్ మాట్లాడుతూ కుటుంబ విలువలు, స్వదేశీ జీవనం, పర్యావరణ హిత జీవన విధానమే ప్రపంచ సంక్షేమానికి మూలమని పేర్కొన్నారు. సంఘం పరివర్తన కార్యక్రమం ద్వారా వ్యక్తి, కుటుంబం, సమాజం మార్పు ద్వారా దేశ వైభవాన్ని సాధించడం లక్ష్యమని ఆయన అన్నారు. రాజ్యాంగం చూపిన బాటలో పౌర విధులను పాటించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. సంఘం శతాబ్ది ఉత్సవాల భాగంగా ప్రతి బస్తీ, ప్రతి గ్రామంలో జాతీయ భావన, సేవా భావనను పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ్ సభ్యులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో శనివారం ఎకో ఫ్రెండ్లీ బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, నగర అభివృద్ధి దిశగా జరుగుతున్న మార్పులకు ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సమాఖ్య వారీగా బహుమతులు అందజేశారు. అదనపు కలెక్టర్, కమిషనర్ జె. అరుణశ్రీ మహిళా సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడుతూ వారిని ఉత్సాహపరిచారు.
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు సేవా పక్వాడ్ కార్యక్రమాల్లో భాగంగా గోదావరిఖని శ్రీ కాకతీయ జూనియర్ కాలేజీలో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరకొండ అపర్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు బీజేపీ రామగుండం ఇంచార్జీ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ ప్రదర్శించగా, విజేతలకు బహుమతులు అందజేశారు. యువతలో ప్రజాసేవ పట్ల ఆసక్తి పెంపొందించడమే సేవా పక్వాడ్ లక్ష్యమని కందుల సంధ్యారాణి తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొండపర్తి సంజీవ్, కోమల మహేష్, ముస్కుల భాస్కర్ రెడ్డి, ఐత పవన్ తదితరులు పాల్గొన్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ పితామహుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపీఎస్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాపూజీ తెలంగాణ ఉద్యమం, స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించి ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారని ఆయన స్మరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌తో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రామగుండం లోక్ కల్యాణ్ మేళాలో భాగంగా శుక్రవారం మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు పోస్ట్ ఆఫీస్ క్యూ ఆర్ కోడ్ స్కానర్లు అందజేశారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం మున్సిపల్ కమిషనర్ (ఎఫ్‌ఏసీ) జె. అరుణశ్రీ మాట్లాడుతూ పోస్ట్ ఆఫీస్ ఖాతాల ద్వారా డిజిటల్ లావాదేవీలతో క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు పొందవచ్చన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం పోస్ట్ ఆఫీస్ ఖాతాలు ఉపయోగపడతాయని తెలిపారు.
గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదనపు జిల్లా న్యాయస్థానం ఆవరణలో గురువారం రాత్రి బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్షిఫ్ మేజిస్ట్రేట్లు నల్లాల వెంకట సచిన్ రెడ్డి, రామగిరి స్వారీక ముఖ్య అతిథులుగా హాజరై వేడుకలను ప్రారంభించారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని వారు పేర్కొన్నారు. అనంతరం మహిళా న్యాయవాదులు, సిబ్బందితో కలిసి బతుకమ్మ పండుగలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీష్, కార్యదర్శి సంజయ్ కుమార్‌తో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు.
రామగుండం ఎఫ్ సి ఐ గేట్ లక్ష్మీపురం 14వ డివిజన్ వాసి శ్యామల సతీష్ కుమార్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1లో ఎంపికయ్యారు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి శంకరయ్య, అనసూయ దంపతుల రెండో కుమారుడు అయిన సతీష్ అనేక కష్టాలు, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పట్టుదలతో చదివి ఈ ఫలితాన్ని సాధించారు. ఆయన ఐఏఎస్, ఐపీఎస్ లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
రామగుండంలో బీజేపీ ఆధ్వర్యంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఇన్‌ఛార్జి కందుల సంధ్యారాణి నేతృత్వంలో “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ – “పండిట్ దీన్‌దయాళ్ చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన జీవితాంతం కృషి చేశారు” అని తెలిపారు. కార్యక్రమంలో మేరుగు హనుమంత్‌గౌడ్, భాస్కర్ రెడ్డి, అపర్ణ, రమేష్, శ్రీనివాస్, మురళి, ఐలయ్య, సాయి, పవన్, కళ్యాణ్, సుమంత్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్, ఆర్&బీ, మున్సిపల్ అధికారులు, డీఈ, ఏఈలతో కలిసి రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలపై సమగ్ర సమీక్ష జరిపారు. పనులు నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం గోదావరి నది పుష్కరఘాట్ వద్ద “ఏక్ దిన్ – ఏక్ ఘంటా – ఏక్ సాత్: నేషన్‌వైడ్ వాలంటరీ శ్రమధాన్” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి మాట్లాడుతూ – “సమిష్టి కృషితోనే స్వచ్ఛత సాధ్యం, పరిశుభ్రతా క్రమశిక్షణను అలవర్చుకోవడంలో ఈ కార్యక్రమం మైలురాయి” అని అన్నారు.